Friday, March 10, 2023

మహాత్ముల విజయ రహస్యం

శిల శిల్పం కావాలంటే..
ఉన్నత స్థితికి చేరు కోవాలని ఆశించేవారెవరైనా విషాదాన్ని అమృతంలా సేవించేందుకు సిద్ధమవ్వాలి. ఇదే మహాత్ముల విజయ రహస్యం.
ఈ జీవిత సత్యాన్ని విశదపరిచే ఒక సన్నివేశం మీ ముందు ఉంచుతున్నాం…
ఓ నదీ తీరాన ఒక యువకుడు నిలబడి, నీళ్ళకోసం కడవ నెత్తిపై పెట్టుకొని వెళుతున్న స్త్రీని చూశాడు. ‘ఆహా! ఆ కడవ ఎంత హుందాగా ఆ స్త్రీ నెత్తిమీద కూర్చుంది’ అని అనుకున్నాడు. దగ్గరకు వెళ్ళి ఆ కుండతో ‘ఓ కడవోత్తమా! నీవు ఇలా ఈ స్త్రీ తలమీద కూర్చొని దర్జాగా వెళుతున్నావు. నీ పనే బాగుంది’ అని అన్నాడు.
అందుకు ఆ కడవ ”ఓ యువ మిత్రమా! నేను ఈనాడు ఇలా హాయిగా ఉండడానికి ముందు ఎన్ని కష్టాలు అనుభవించానో తెలుసా? 
మీ మానవులు మొదట నన్ను గునపాలతో పొడిచి నా తల్లి భూమాత నుండి వేరు చేసినప్పుడు ఎంతగానో కుంగిపోయాను.
ఆ తరువాత నన్ను పాదాలతో తొక్కుతూ హింసించినప్పుడు ఎంతో సహనం వహించాను. అది సరిపోదన్నట్లు బట్టీలో పెట్టి కాల్చినప్పుడు ఎంత బాధను అనుభవించానో నీకేం తెలుసు?
ఆ తరువాత అంగడిలో నన్ను అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారులతో తిన్న మొట్టికాయలు అన్నీ ఇన్నీ కావు. 
ఇలా ఎన్నో కష్టాలు అనుభవించబట్టే ఈనాడు ఈ స్థాయికి చేరుకోగలిగాను” అని తన విషాదగాధను వినిపించింది.
నిజమే కదా...అనుకున్నాడు ఆ యువకుడు.
ఎన్నో కష్టాల తరువాత గాని మట్టి.. కుండ అవ్వదు.. ఎన్నో దెబ్బలకు ఓర్చితే గాని రాయి శిల్పం అవ్వదు. బాధలకోర్వలేని మనిషి మహనీయుడు అవ్వలేడు
“కష్టాలు మన జీవన సౌధ నిర్మాణానికే గాని, వినాశానికి కాదు” అన్న హితోక్తిని అర్థం చేసుకున్న మహాత్ములు విషాదమనే చీకటి నుండే ఆనందమనే కాంతి కిరణాలు ఆవిర్భవిస్తాయని నిరూపించారు.

No comments:

Post a Comment