#నాగలి_కథ
సేకరణ: Social Media
నాగలి ఎలా తయారు చేస్తారు? ఆ రోజుల్లో పెద్దగా చదువుకోకపోయినా మన పూర్వీకుల పనితనం ఎలా ఉండేది.? వ్యవసాయ పనిముట్లపై వాళ్ళ శ్రద్ధా భక్తి ఎలా ఉండేవి?
ఇలాంటి విషయాలు... నేను తప్ప ఎవరూ గ్రంథస్తం చేయరు...ముందు తరాలకు ఈ విషయాలు తెలియాలి అని సంకల్పించి మరీ #నాలుగో_ఎకరం పుస్తకం రాసారట #శ్రీరమణ గారు...
--------------------------------------------------
పక్కనే ఆనించి పెట్టిన అరకని తీసి దాని తల తన ఒళ్లో పెట్టుకున్నాడు పెద్దకాపు. నేను కళ్లు విప్పార్చి చూస్తూ కూర్చున్నాను. పక్కనే మంచి గుమ్మడిపండు తొడిమెమూతతో వున్న చిన్న నూనెసీసా అందుకున్నాడు. అందులోంచి ఏకుని ముంచి తీశాడు.
"ఇది అవిశనూనె. నాగలిదుంపకి అప్పుడప్పుడు రాస్తా ఉండాల. ఇదిగో ఈ చివర బిగించిన 'కర్రు' తుప్పట్టకుండా దీనికీ రాయాలి" అంటూ ఆ పని వైనంగా పూర్తిచేసి నాగలిని బుజం మీద వేసుకు తీసికెళ్లి పక్కనున్న గోడకి అమర్చాడు.
దానితో పని తీరిపోయినా ఆ రైతుకున్న శ్రద్ధ, మమకారం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నూనెచేతులు పాదాలకు రాసుకుంటూ, "ఇంకేంటి సామీ సంగతులు" అన్నాడు చనువుగా..
ఏం లేవంటూనే, "దీన్ని ఏ కొయ్యతో చేస్తా"రన్నాను ఆసక్తిగా.
"సాజెంగా తుమ్మకర్రతో చేస్తారు.”
నా వంక చూసి, “నాగలి దుంపంటే బజార్లోనో సంతలోనో దొరికేది కాదు. దీని కత చెబుతా... విను" అని మొదలుపెట్టాడు.
"అబ్బో! ముందసలు దుంపకి దుంగ దొరకాల. ఫుల్గా చేవ పట్టి ఉండాలి. పది జానల తుమ్మ మొద్దుని నాలుగు అమావాశ్శల పాటు నీళ్లలో ఊరెయ్యాలి. దాన్ని బయటకు తీసి ఓ నెలపాటు ఎండలో పడెయ్యాలి. పై బెరడు సుబ్రంగా వొలవాల. అప్పుడు బెమ్మం బాబాయ్ దాన్ని తట్టి, తిప్పి అన్ని దిశల్నించీ చూసి, మాంఛి లగ్గం పెట్టి పనిలోకి దిగుతాడన్నమాట. అబ్బో! అదో పెద్ద అంగామా” అంటూ ఊపిరి పీల్చుకుని నా వైపు చూశాడు.
నా కళ్లు చెప్పమన్నట్టు చూశాయ్.
మళ్లీ కథ మొదలైంది.
"బెమ్మంగారి చూపులు తీవ్రంగా ఉండేవి. పిట్టలా గుప్పెడు మడిసి. గావంచా, కాసంత కుంకం బొట్టు, మెడలో వేలాడే పెద్ద రుద్రాచ్చ, చిన్న లింగం రాయితో ఉండే బెమ్మంగారిని, 'నువ్ మాంత్రికుడల్లే ఉంటావ్ బాబాయ్' అంటే, 'ఔనను... మాంత్రికుణ్ణే... నాగలిదుంపని చెక్కడమంటే మాటలా... ఓ దేవుడ్ని చెక్కడమే' అనేవాడు.
దుంగకి ఓ పక్కగా నిలబడి పెద బాడిసతో ఆయన చెక్కడం చిత్రంగా ఉండేది. ఎక్కడా కొలతలు, గీతలు ఉండవ్. బాబాయ్ మనసులో, కళ్లలో ఉంటాయంతే! రోజూ పొద్దుటిపూట వాలెండలో ఓ గంటసేపు మాత్రమే ఈ పనిలో ఉండేవాడు.
ఆ అరక ఆసామి అది పూర్తయే నెల్రోజులూ ఫ్లాస్కో నిండా కాఫీ తీసికెళ్లాలి. ఆరారగా కాఫీ తాగడం బెమ్మంగారికి అలవాటు.
రోజూ పొద్దున్నే ఎల్లేవాణ్ణి, సొంతగాడు శ్రద్ధ చూపించకపోతే బాబాయ్కి సెడ్డ కోపం వచ్చేది. నెల్రోలకి పెదబాడిస పని పూర్తయింది. చినబాడిసతో, చిత్రిగ్గులతో సవరింపులు చేశాడు.
'ఉక్కుముక్కలా ఉంది కాపూ... అంతా చేవే' అని మెచ్చుకున్నాడు. నాగలి దుంపని పదిసార్లు తడిమి చూసి, చేత సరిగ్గానే ఉందనుకున్నాడు.
'కుదిరిగ్గా వచ్చిందిలే.... ఏట్లో సొరశాపల్లే నేల్లో దూసుకుపోతంది రాగవా' అన్నాడు.
'అంతా నీ పనితనంమయిమ బాబాయ్' అంటే -
'నాదేవుంది... అది తుమ్మమానులో నీ కోసం కూకునుంది... దాన్ని సుతారంగా బయటకు లాగా... అంతే!" అన్నాడు, లోపల మురిసిపోతానే,
మిగతా నిలువుపీట, మేడి ఒక్క పూటలో సిద్ధం చేశాడు. కొలిమి పెట్టి ఉక్కుకర్రు పోత పోశాడు. దానికి 'వాయ' పెట్టాడు. పదునుతో బుసలు కొడుతున్న కర్రుని దుంపకొనకి ఇనపకట్టుతో గట్టిగా బిగించాడు. మళ్లీ ఒకసారి తడిమి చూసుకున్నాడు. కొత్త నాగలికి పసుపుకుంఖాలు పెట్టి నా బుజానికెత్తాడు బాబాయ్.
'వేయి ఏరువాకల పాటు మీ క్షేత్రాలు దున్ని, బంగారు పంటలు పండించాలి' అరకతో నించున్న నన్ను వెన్నుతట్టి దీవించాడు.
చకునం చూసి సాగనంపాడు... నాకు బాగా గుర్తు... యింకా కళ్లముందుంది.
ఓ బస్తా గింజలు పంపితే తీసుకునేవాడు.. లేదంటే అడిగేవాడు కాదు...
ఇదే మనూరి బెమ్మం గారు చెక్కిన ఆఖరి నాగలి దుంప...అది సామీ దీని కత...
అంతా విన్నాక నాకు దాన్నోకసారి తాకాలనిపించింది.. రెండు చేతులతో దాన్ని అద్దుకున్నాను...
ఫోటోలు : శ్రీనివాస్ రెడ్డి గారు
No comments:
Post a Comment