ఆపదలు... అనుభవాలు... ఆత్మవిశ్వాసం... పునర్జీవనం!
సమాజహితం కోసం చేపట్టిన ఒక మంచి కార్యానికి ఆటంకాలు, అవరోధాలు ఎదురయ్యాయంటే... ఆ కార్యం మరింత గొప్పగా రూపుదిద్దుకోవడానికేనన్న పెద్దల మాట అక్షరాలా సత్యం.
అలాగే, మనకు ఎదురయ్యే ప్రతి ఆటంకం, ప్రతి ఆపద మనల్ని పరీక్షించడమే కాదు... మనలోని శక్తిని వెలికితీసి, మన స్థాయిని పెంచడంతో పాటు, ఆ క్లిష్ట సమయంలో మనవారెవరో, పరాయివారెవరో కూడా పరిచయం చేస్తుంది. మన వెంటే నడిచేవారెవరు? మనల్ని నడిపించేవారెవరు? మనం కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనిచ్చేవారెవరు? అన్నది తెలియజేస్తుంది.
అయితే, ఈ సత్యాల లోతును మాటల్లో వినడం వేరు... స్వయంగా అనుభవించి, ఆ అనుభూతిని పొందడం వేరు. అలాంటి అనుభవం ఎదురైనప్పుడే వాటి విలువ, వాటి వెనుక ఉన్న జీవిత సత్యం పూర్తిగా అర్థమవుతాయి.
ఒకప్పుడు అద్భుతంగా సాగుతున్న GSF కార్యక్రమాలకు నిలయంగా, పల్లె ఆణిముత్యాల ప్రతిభకు వేదికగా ఎదుగుతున్న సాధన కుటీర్ 2022లో అక్రమార్కుల దాడికి గురై విధ్వంసానికి గురైంది. ఆ దాడి సృష్టించిన విధ్వంసం ఒక భౌతిక నష్టం మాత్రమే కాదు... ఒక సంకల్పానికి, ఎన్నో ఆశలకు ఎదురైన తీవ్రమైన పరీక్ష.
అయినా ఆ దెబ్బకు కుంగిపోకుండా, ఎదురైన ఆటుపోట్లను తట్టుకుని, కోల్పోయిన శక్తిని కూడదీసుకుని సాధన కుటీర్ తిరిగి నిటారుగా నిలబడిన ప్రస్థానంలో పొందిన అనుభవాలు, అనుభూతులే ఈ అక్షరాలకు ప్రేరణ.
అందుకే అంటారు... మనకు ఆపదలు సృష్టించినవారిని, ఆపద సమయంలో మనల్ని వదిలేసినవారిని, అదే ఆపద సమయంలో మనకు అండగా నిలిచినవారిని ఎప్పటికీ మర్చిపోకూడదని.
ఎందుకంటే, ఈ ముగ్గురూ మన జీవితంలో ఏదో ఒక పాఠాన్ని నేర్పుతారు. ముఖ్యంగా, కష్టకాలంలో మనకు చేయూతనిచ్చినవారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే సమయంలో, మనల్ని మనం నమ్ముకుని, స్వతంత్రంగా ఎదిగేలా చేసిన అనుభవాల పట్ల కూడా కృతజ్ఞతతో ఉండాలి.
ఇక్కడ కూడా అదే జరిగింది!
ఎన్నో ఆటుపోట్లను అధిగమించి, ఈ కాలంలో GSF కార్యానికి తిరిగి పునర్జీవం పోసుకుని, సాధన కుటీర్ మళ్లీ తన లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న సందర్భమిది.
మరో విశేషమేమిటంటే... ఏమాత్రం ఆర్థిక స్థిరత్వం లేకపోయినా, నిరంతరం కొనసాగాల్సిన సమాజహిత కార్యక్రమాలకు ఎలాంటి లోటు రాకుండా, అవసరమైన సమయానికి అవసరమైన వనరులు, సహకారం సమకూరుతూ ఉండటం నిజంగా దైవానుగ్రహమే! ప్రకృతి కరుణే! మన సంకల్పం స్వచ్ఛంగా, లక్ష్యం సమాజహితంగా ఉన్నప్పుడు ప్రకృతి ఏదో ఒక రూపంలో సహకరిస్తుందనడానికి ఇదొక ప్రత్యక్ష అనుభవం. ఆ సహకారం అందించిన ప్రతి హృదయం వెనుక ఒక దైవ సంకల్పం ఉందని భావిస్తాను.
ఈ పునఃప్రస్థానంలో, ముఖ్యంగా ఈ సంధికాలంలో మాకు అండగా నిలిచిన ప్రతి హృదయానికి, ప్రతి సహృదయానికి, ప్రతి శ్రేయోభిలాషికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇకముందు... ప్రారంభ దశలో ఉన్న అదే శ్రద్ధను, అదే శక్తిని, అదే పట్టుదలను తిరిగి కూడదీసుకుని, పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసం మరింత చైతన్యంతో, స్ఫూర్తితో, అంకితభావంతో పనిచేయాలన్నదే నా సంకల్పం.
GSF ఆవిర్భావం నుంచి ఎదుగుదల వరకు, ఎదురైన ఆటుపోట్లు, సాధించిన విజయాలు, నేర్చుకున్న పాఠాలు, పునర్జీవన ప్రస్థానం వరకు... GSF ప్రయాణాన్ని సమయానుకూలంగా, సవివరంగా మీ ముందుంచుతాను. అది కేవలం ఒక సంస్థ ప్రస్థానం మాత్రమే కాదు... ఒక సంకల్పం, ఎన్నో అనుభవాలు, అనేకమంది సహకారం, మరెన్నో జీవితాల ఆశల ప్రయాణం.
ఆ సంకల్పానికి ప్రకృతి సహకరించాలని... సమాజహితాన్ని కోరుకునే సహృదయుల సహకారం నిరంతరం అందాలని... ఎదురయ్యే ప్రతి పరిస్థితినీ అధిగమించే శక్తి, ఓర్పు, ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ...
ఆటంకాలు మనల్ని ఆపలేవు... అవి మనల్ని మరింత దృఢంగా నిలబెట్టే మెట్లుగా మారాలి.
సంకల్పం బలంగా ఉంటే పునఃప్రారంభం కూడా ఒక నూతన చరిత్రకు నాంది అవుతుంది!.
:~ సదా వెంకట్, GSF
No comments:
Post a Comment