Wednesday, July 1, 2026

మన సంకల్పమే మన ఆయుధం

మన సంకల్పమే మన ఆయుధం.. అదే  నిజమైన బలం.
 వ్యక్తుల కోసం కాదు, వ్యవస్థ కోసం సేవ/బాధ్యత.

ఒక  సంకల్పాన్ని స్వీకరించిన తర్వాత ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని అపార్థాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా చివరి వరకు నిలబడగలిగిన వారే నిజమైన ధీరులు.
 పరిస్థితులను బట్టి మారిపోయేవారు, పారిపోయే వారు కాదు, సిద్ధాంతాన్ని బట్టి నిలబడేవారే ఏ సంస్థకైన వెన్నెముకలా ఉంటారు.

ఏ వ్యవస్థ /సంస్థలోనైనా పనిచేసే ప్రతి వ్యక్తి పరిపూర్ణుడు కావాల్సిన అవసరం లేదు. 

లోపాలు, భిన్నాభిప్రాయాలు ,పరిమితులు సహజమే. 
కానీ వాటిని అధిగమిస్తూ, వ్యక్తులను కాకుండా లక్ష్యాన్ని గొప్పదిగా భావిస్తూ, నిజాయితీతో, నిబద్ధతతో, కీర్తి కాంక్ష లేకుండా, ఫలాపేక్ష లేకుండా సేవ చేయడం ఎంతో ఉన్నతమైన గుణం.

సంస్థను ముందుకు నడిపేది వ్యక్తుల ప్రతిభ ఒక్కటే కాదు;
వారి త్యాగం, సహనం, క్రమశిక్షణ, పరస్పర విశ్వాసం, సేవాతత్వం. అందుకే చివరి వరకు వ్యవస్థ/ సంస్థతో కలిసి నడిచిన వారే దాని చరిత్రలో బాగస్తులవుతారు. మధ్యలో విడిచిపెట్టినవారు కారణాలు చెబుతారు; చివరి వరకు నిలిచినవారు ఫలితాలు చూపిస్తారు.

తన అసమర్థతకు, తమ అనాసక్తికి ఇతరులను బాధ్యులుగా చూపడం బలహీనతకు సంకేతం. 
కానీ తన బాధ్యతను గుర్తించి, తన వంతు కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించడం నిజమైన కార్యకర్త లక్షణం.

గుర్తింపు కోసం కాదు... కర్తవ్యం కోసం పనిచేయాలి.
ప్రశంసల కోసం కాదు... పరమార్థం కోసం నిలబడాలి.
వ్యక్తుల కోసం కాదు... వ్యవస్థ కోసం అంకితమవ్వాలి.
 ఆటు పోట్లు ఎన్ని వచ్చిన చివరి వరకు నిలబడిన వారే నిజమైన కార్యకర్తలు... 
వారే నిజమైన సేవకులు... 
నిజమైన విజేతలు.

మైమరచి చేసే నిస్వార్థ సేవ ద్వారా రావాల్సినంత పేరూ/కీర్తి వస్తుంది.
ఎప్పటికి అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం...
సమాజ హితం కోరి సంకల్పించిన ఏ ఒక్క కార్యo కూడా నీవు, నేను లేకున్నా ఆగదు గాక ఆగదు.. అవకాశం తీసుకుని మనమే భాగస్తులమవుతే అదృష్ట వoతులం లేదు, కాదు, కూడదు అంటే దురదృష వoతులం.. 
కాబట్టి ఉన్న సమయంలో కొంత, సంపదలో కొంత సమాజ హితం కోసం సమర్పణ(ప్రతిఫలం ఆశించక) బావంతో చేస్తే, మిగతాది ప్రకృతి చూసుకుంటుంది.. ఇది అక్షరాల కూర్పు కాదు, చరిత్ర చెప్పిన నిజం.

No comments:

Post a Comment