Monday, December 15, 2025

సర్పంచ్ ఎన్నికలు - 2025

విషయం కొంత ఎక్కువ ఉన్నది.. అయినా చదవాలి👇.
రాజకీయం అంటే సేవ అనే సోయి ఉన్నోనికే ఓటు*

*కొనుక్కునే వాడెప్పుడు వ్యాపారే...            రాజకీయం వ్యాపారం కాదు, కాకూడదు.. అది  సేవ*.. సేవగానే ఉండాలి.
అలా ఉండాలంటే మనమే కారణం కావాలి. ఆలోచిద్దాం.

నందినాథ క్షేత్రం లోని ఓటర్లందరికీ విన్నపం.  
 అవును నందివనపర్తినే నందినాథ క్షేత్రం అంటున్నాం.  

 ఓటు హక్కు వేయడానికి ఇంకొక్క రోజు మాత్రమే ఉన్నది. ఒక్క నిమిషం ముందు కూడా ఆలోచన చేయొచ్చు.  ఓటు హక్కు ఉన్నొల్లంతా ఇందులో ఉన్నారని కాదు, ఉన్న వాళ్లందరూ చదువుతారనీ కాదు..  కానీ చదవాలి, చదివిన వారంతా ఇంకో  నలుగురిని, కనీసం మన కుటుంబ సభ్యులనైనా చైతన్యo చేయాలి..      

      ఈ ఊరికి ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుంది.  ఆ పేరు రావడానికి, వచ్చిన పేరు   అలాగే నిలవడానికి అనేక మంది పెద్దల త్యాగం ఉన్నది. అది అలాగే కాపాడుతూ భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ఇప్పటి వారిది.  ఈ క్షేత్రంలో అనేక మంది విద్యావంతున్నారు, సేవా తత్పరులు ఉన్నారు, యువజన సంఘాల పేరున తమ అమూల్యమైన సమయం ఇచ్చి గ్రామం కోసం సేవను బాధ్యతగా చేసిన వారు ఉన్నారు. ఇతర ప్రాంతాలలో మార్గదర్శకులుగా ఉన్నవారూ ఉన్నారు. ఇప్పుడు అందరూ ఆలోచన చేయాలి.
*మంచి కోసం ప్రపంచ దేశాలు భారత దేశాన్ని చూసినట్టు, పరిసర ప్రాంతాలు వనపర్తిని చూస్తాయి...చూడాలి*.

*ఆధ్యాత్మిక అంటే కేవలం పూజలు, అర్చనలు, యజ్ఞ యాగాలు,హోమాలు మాత్రమే కాదు. అదొక వ్యక్తిత్వ వికాసం, సామాజిక చైతన్యం*. అందరూ ఆనందంగా ఉండాలని ఆశిస్తూ.. తోటి వారికి సహకారం అందించాలనే తెలిపే వికాస సాధనం.  అది ఆచరణ జరగాలి.  కాల గమనంలో కొన్ని మార్పుల వలన ఆధ్యాత్మిక నిలయాలైన ఆలయాల వ్యవస్థను రాజకీయం చేయబడుతుంది..    ఆలయాల ద్వారా ఆధ్యాత్మిక విలువలతో పాటు సామాజిక చైతన్యం అందించబడింది.    అదే స్ఫూర్తితో నేను ఈ విషయం తెలుపోతున్నాను.

   అందరికీ తెలిసిన విషయాలే అయినా సమయానుసారం తెలపాల్సిన అవసరం కొన్ని సార్లు ఉంటుంది.

   రాజకీయం అంటే సేవ అనేది మరిచి, అధికార దర్పం పదర్శించడం, అనేక రకాలుగా దోపిడీలు చేయడం కొనసాగుతున్న విషయం అందరం చూస్తున్నాం. 
అది మారాలి అని అందరికీ ఉన్నా, మన ద్వారా చేయలేకున్నాం. 
కానీ  వీటికి మన ద్వారానే మార్పు జరగాలి. 

 *ఆలయాల దగ్గర అతిథి మర్యాదలు ఆశించే వారిని, ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా అనుకుంటున్న వారిని, ప్రతిఫలం ఆశించి ఆలయాలకు ఆర్థిక సహకారం, సేవలు  అందించి, అధికార దర్పం ప్రదర్శించే వారిని ఆమడ దూరం జరపాల్సిన అవసరం ఉన్నది*.  
 రాజకీయం అంటే విందు, మందుతో పాటు నోటు ఇచ్చి  ఓటు కొoటo అనుకునే వారికి తగ్గిన బుద్ధి చెప్పాల్సింది మనమే.  చెప్పక పోతే అనుభవిస్తాం.     

కొనుక్కునే వాడు ఎప్పుడూ ఉంటాడు అమ్ముడు పోయే వారే ఆలోచించాల్సిన అవసరం ఉంటది..  
 అమ్ముడు పోతే..
 హక్కుగా అడిగే హక్కే లేకుండా పోయినట్టే.. 
మన ఒక్క ఓటుతో ఏమైతది అనుకోవడం పెద్ద మానసిక జబ్బు. ఒక్క ఓటుతో నేడు అనేక ఫలితాలు తారుమారు అవుతున్నాయి. తరువాత ఐదేండ్లు ఏడిస్తే ఏమి లాభo లేదు.
ఓటు వేసే ఒక్క నిమిషం ముందైనా ఆలోచన చేయాలి.. 
 *నిజాయితీగా ఉండేతోడు ఎవడు, అధికార దర్పం చూపని వాడు ఎవడు, ధన దాహం, భూ దాహం లేనిది ఎవరికి, కులాల కుంపటి లేనిది ఎవరికి,  రాజకీయం అంటే సేవ, నేను సేవకుణ్ణి అనే సోయితో ఉండేవాడు ఎవరు,  తమ అవసరాల కోసం ఉసరవెల్లిలా రంగులు మార్చినట్టుగా తన వ్యక్తిత్వాన్ని  మార్చే వారెవరు  అని వెతికి మరీ ఓటు వేయాలి.          ముందే చెప్పినట్టు ఈ క్షేత్ర పవిత్రత కాపాడే వారికే మన అండగా ఉండాలి*.
                               *కొనుక్కునే వాడెప్పుడు వ్యాపారే... రాజకీయం వ్యాపారం కాదు సేవ*..  వ్యాపారి ఎప్పుడు సేవకుడు కాడు, వాడేప్పటికీ దోపిడి దారే..                    
పెట్టిందంతా వసూలు చేస్తాడు, కాకుంటే మార్గాలు వేరు..   అందుకే ఆలోచన చేయాలి..

 *మన కులపోడు, మన దోస్తు, మా పార్టీ వాడు, మనకు దగ్గరోడు, పైసలున్నోడు, పరపతి  ఉన్నోడు అని చూడకుoడా.... నిజాయితీగా, సేవకుడిగా ఉండేతోడిని, సొంత ఆలోచనలు మెండుగా ఉన్నా సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి ఉండేతోడిని ఎన్నుకోవడానికి మన ఓటు వేయాలి. అది సార్ధకం కావాలి*... 

ముందే చెప్పినట్టుగా *ఆధ్యాత్మిక అంటే కేవలం పూజలు, అర్చనలు, యజ్ఞ యాగాలు, హోమాలు చేయడం మాత్రమే కాదు.. అదొక నిత్య చైతన్యం*  అని నమ్మి, వీలైనంత త్వరలో *నందివనపర్తిని నందినాథక్షేత్రంగా చూడాలనే ఆశయంతో ఉన్న వ్యక్తిగా అభ్యర్థన చేస్తున్నా*...

*మంచి, చెడు మీకూ తెలుసు... చెడు పైన సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆశిస్తూ*...
:~ సదా వెంకట్ రెడ్డి,

No comments:

Post a Comment