Wednesday, December 24, 2025

బడి వజ్రోత్సవం...

అందరం గమనిద్దాం...    

*ఊరి బడి వజ్రోత్సవం జరపుదాo _ చదువు నేర్పిన ఋణం తీర్చుకుందాం*. 

 నందివనపర్తి లో బడి ప్రారంభమై 60ఏండ్లకు పైనే అయి ఉండొచ్చు.. 
ఎందరికో ఓనమాలు దిద్దించి విద్యావంతులను చేసింది ఈ బడే..
 వారంతా జీవితంలో గొప్పగా ఎదిగిన వారుగా ఉన్నారు... అందరినీ మల్లా ఆ బడికి పిలిచి వారికి ఆనందం పెంచడంతో పాటు, ఆ బడికి కొండంత అండ వచ్చేలా చేయొచ్చు.

ఊరి బడి వజ్రోత్సం పేర  ఒక మంచి కార్యక్రమ నిర్వహణతో అత్యద్భుత ఫలితాలు రావొచ్చు.   
 *మానవ సంస్కార నిలయాలు అమ్మ ఒడి, బడి, గుడి* అని మన పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం.

ఈ క్షేత్రంలో అనేక గుడులన్నాయి, వాటి ద్వారా అనేక ఉత్సవాలు జరుగుతున్నాయి.. 
అదే విధంగా బడి ఉన్నది, అది ఎంతో మందికి చదువు నేర్పింది, బతుకు నేర్పింది. ఆ ఆ బడి ఋణం తీర్చుకునే అవకాశం తీసుకుందాం. 
 అందుకే ఈ బడిలో చదివిన అందరినీ కలిపి ఒక అద్భుత ఉత్సవం  చేసి ఒక గొప్ప ఆనవాయితీనీ ప్రారంభించవచ్చు. అది రేపటి తరం పిల్లలకు ఆసరా, అభయ హస్తం కావచ్చు.

అవకాశం ఉన్న కొందరు అప్పడప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనాల ద్వారా కలుస్తున్నారు..
దానిని సామూహికం చేసి నందివనపర్తి పాఠశాల వజ్రోత్సవం జరిపితే అద్భుతంగా ఉంటుంది.
ఈ ఆలోచన అందరి మనసుల్లో ఉంటుంది.
నాకైతే గత కొన్నేళ్లుగా ఏళ్లుగా నిరoతరంగా ఉంటుంది, కొందరి పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాం..
ఇప్పుడు సమయం వచ్చినట్టుంది..
 కావున గ్రామంలోని *యువజన సంఘాలు, ముఖ్యంగా జ్యోతి యూత్ అసోసియేషన్ మరియు గ్రామ పంచాయతీ మరియు ZPHS పాఠశాల సిబ్బంది  సహకార సమన్వయంతో ఈ ఉత్సవం జరిగి అద్బుత ఫలితాలుo టాయి.*

కొంత ఎక్కువ సమయం తీసుకుని, అద్బుత ప్రణాళికతో ఉత్సవం జరుపొచ్చు..
రాష్ట్రానికి ఒక గొప్ప మోడల్ ఇవ్వొచ్చు.

కావున యువజన సంఘాల పెద్దలు సమయం తీసుకుని, *పూర్వ  SSC Batches నుండి కొందరిని తీసుకుని ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తే ఒక అద్బుత ప్రణాళికతో ముందుకెళ్ళొచ్చు*..
వ్యక్తిగతంగా నా వైపు నుండి కూడా సమయం ఇవ్వగలను..
*ఊరి బడి వజ్రోత్సవం జరపుదాo - చదువు నేర్పిన ఋణం తీర్చుకుందాం*
జరగాలి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు - అవి కావాలి పల్లె ఆణిముత్యాల అభయ హస్తాలు.

:~ సదా వెంకట్,
B.A., LL.B, PGDCJ.
(ZPHS NWP పూర్వ విద్యార్థి)

Monday, December 22, 2025

మహాత్మా .... హే రామ్..

మహాత్మా.... ప్రపంచానికి  అహింస అనే అద్భుతమైన ఆయుధం ఇచ్చావ్...
 ఈశ్వర్ అల్లా తేరా నామ్ అనే మహాద్భుత నినాదం ఇచ్చాం. 
 దానితోనే నీ అనుకూయులకు గట్టిగా చెప్పండి..  మతం కన్నా ముందు మనిషిని మనిషిగా చూడమని..

ఒక మనిషిని బహిరంగంగా చెట్టుకు  ఉల్టా  కట్టేసి, బతికున్న మనిషి  తోలు తీసి, పెట్రోల్ పోసి నిప్పంటిస్తే వచ్చే అర్ధనాదంతో  ఆనందం పొందుతున్న వారి దగ్గరక కెళ్ళి ఈశ్వర్ అల్లా తేరే నామ్  అని గట్టిగా బుద్ధి చెప్పమను.   హే రామ్ అనమను...

స్నేహం.....

*స్నేహం అంటేనే అంతరాలు చూపనిది*..
*స్వచ్ఛమైన స్నేహం ఎప్పటికీ కాపాడబడాలి.*

అంతరాలు చూపని స్నేహమే సుగంధపు వాసనలా నలుదిశలా వ్యాపిస్తుంది.

 పైసలు–పరపతి చూస్తూ,
రేపటి అవసరాలను బేరీజు వేసుకుని స్నేహాలు చేస్తున్న  ఈ రోజుల్లో...

నిజాయితీగా, కల్మషం లేని స్నేహమని వేనోళ్ళు పొగుడుతున్న వీరి స్నేహ బంధం నిజంగా ఆదర్శనీయం..

అవసరం కోసం స్నేహం చేసి ఆపదలో ముఖం చాటేసే నేటి స్నేహాల మధ్య అవసరంలో పక్కన ఆపదలో ముందు అని వీరిపై వేనోళ్ళ కురుస్తున్న అభిమానుల్లో మనము ఉందాం..

కృష్ణ కుచేలుల స్నేహమoత లేకున్నా స్నేహం ముసుగులో కుట్రలు కుతంత్రాలు చేయని వారిలో మనముందాం.

( గ్రామంలో జరిగిన భీకర ఎన్నికల పోరు వేళ అధైర్య పడక, ఒకటే మాటగా నిలిచి, గెలిచిన స్నేహమని ఊరంత అంటుంటే కేవలం స్నేహ విషయం కోసం ఇలా ✍️..వారే జయ్  విజయ్ లు).

Monday, December 15, 2025

సర్పంచ్ ఎన్నికలు - 2025

విషయం కొంత ఎక్కువ ఉన్నది.. అయినా చదవాలి👇.
రాజకీయం అంటే సేవ అనే సోయి ఉన్నోనికే ఓటు*

*కొనుక్కునే వాడెప్పుడు వ్యాపారే...            రాజకీయం వ్యాపారం కాదు, కాకూడదు.. అది  సేవ*.. సేవగానే ఉండాలి.
అలా ఉండాలంటే మనమే కారణం కావాలి. ఆలోచిద్దాం.

నందినాథ క్షేత్రం లోని ఓటర్లందరికీ విన్నపం.  
 అవును నందివనపర్తినే నందినాథ క్షేత్రం అంటున్నాం.  

 ఓటు హక్కు వేయడానికి ఇంకొక్క రోజు మాత్రమే ఉన్నది. ఒక్క నిమిషం ముందు కూడా ఆలోచన చేయొచ్చు.  ఓటు హక్కు ఉన్నొల్లంతా ఇందులో ఉన్నారని కాదు, ఉన్న వాళ్లందరూ చదువుతారనీ కాదు..  కానీ చదవాలి, చదివిన వారంతా ఇంకో  నలుగురిని, కనీసం మన కుటుంబ సభ్యులనైనా చైతన్యo చేయాలి..      

      ఈ ఊరికి ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుంది.  ఆ పేరు రావడానికి, వచ్చిన పేరు   అలాగే నిలవడానికి అనేక మంది పెద్దల త్యాగం ఉన్నది. అది అలాగే కాపాడుతూ భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ఇప్పటి వారిది.  ఈ క్షేత్రంలో అనేక మంది విద్యావంతున్నారు, సేవా తత్పరులు ఉన్నారు, యువజన సంఘాల పేరున తమ అమూల్యమైన సమయం ఇచ్చి గ్రామం కోసం సేవను బాధ్యతగా చేసిన వారు ఉన్నారు. ఇతర ప్రాంతాలలో మార్గదర్శకులుగా ఉన్నవారూ ఉన్నారు. ఇప్పుడు అందరూ ఆలోచన చేయాలి.
*మంచి కోసం ప్రపంచ దేశాలు భారత దేశాన్ని చూసినట్టు, పరిసర ప్రాంతాలు వనపర్తిని చూస్తాయి...చూడాలి*.

*ఆధ్యాత్మిక అంటే కేవలం పూజలు, అర్చనలు, యజ్ఞ యాగాలు,హోమాలు మాత్రమే కాదు. అదొక వ్యక్తిత్వ వికాసం, సామాజిక చైతన్యం*. అందరూ ఆనందంగా ఉండాలని ఆశిస్తూ.. తోటి వారికి సహకారం అందించాలనే తెలిపే వికాస సాధనం.  అది ఆచరణ జరగాలి.  కాల గమనంలో కొన్ని మార్పుల వలన ఆధ్యాత్మిక నిలయాలైన ఆలయాల వ్యవస్థను రాజకీయం చేయబడుతుంది..    ఆలయాల ద్వారా ఆధ్యాత్మిక విలువలతో పాటు సామాజిక చైతన్యం అందించబడింది.    అదే స్ఫూర్తితో నేను ఈ విషయం తెలుపోతున్నాను.

   అందరికీ తెలిసిన విషయాలే అయినా సమయానుసారం తెలపాల్సిన అవసరం కొన్ని సార్లు ఉంటుంది.

   రాజకీయం అంటే సేవ అనేది మరిచి, అధికార దర్పం పదర్శించడం, అనేక రకాలుగా దోపిడీలు చేయడం కొనసాగుతున్న విషయం అందరం చూస్తున్నాం. 
అది మారాలి అని అందరికీ ఉన్నా, మన ద్వారా చేయలేకున్నాం. 
కానీ  వీటికి మన ద్వారానే మార్పు జరగాలి. 

 *ఆలయాల దగ్గర అతిథి మర్యాదలు ఆశించే వారిని, ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా అనుకుంటున్న వారిని, ప్రతిఫలం ఆశించి ఆలయాలకు ఆర్థిక సహకారం, సేవలు  అందించి, అధికార దర్పం ప్రదర్శించే వారిని ఆమడ దూరం జరపాల్సిన అవసరం ఉన్నది*.  
 రాజకీయం అంటే విందు, మందుతో పాటు నోటు ఇచ్చి  ఓటు కొoటo అనుకునే వారికి తగ్గిన బుద్ధి చెప్పాల్సింది మనమే.  చెప్పక పోతే అనుభవిస్తాం.     

కొనుక్కునే వాడు ఎప్పుడూ ఉంటాడు అమ్ముడు పోయే వారే ఆలోచించాల్సిన అవసరం ఉంటది..  
 అమ్ముడు పోతే..
 హక్కుగా అడిగే హక్కే లేకుండా పోయినట్టే.. 
మన ఒక్క ఓటుతో ఏమైతది అనుకోవడం పెద్ద మానసిక జబ్బు. ఒక్క ఓటుతో నేడు అనేక ఫలితాలు తారుమారు అవుతున్నాయి. తరువాత ఐదేండ్లు ఏడిస్తే ఏమి లాభo లేదు.
ఓటు వేసే ఒక్క నిమిషం ముందైనా ఆలోచన చేయాలి.. 
 *నిజాయితీగా ఉండేతోడు ఎవడు, అధికార దర్పం చూపని వాడు ఎవడు, ధన దాహం, భూ దాహం లేనిది ఎవరికి, కులాల కుంపటి లేనిది ఎవరికి,  రాజకీయం అంటే సేవ, నేను సేవకుణ్ణి అనే సోయితో ఉండేవాడు ఎవరు,  తమ అవసరాల కోసం ఉసరవెల్లిలా రంగులు మార్చినట్టుగా తన వ్యక్తిత్వాన్ని  మార్చే వారెవరు  అని వెతికి మరీ ఓటు వేయాలి.          ముందే చెప్పినట్టు ఈ క్షేత్ర పవిత్రత కాపాడే వారికే మన అండగా ఉండాలి*.
                               *కొనుక్కునే వాడెప్పుడు వ్యాపారే... రాజకీయం వ్యాపారం కాదు సేవ*..  వ్యాపారి ఎప్పుడు సేవకుడు కాడు, వాడేప్పటికీ దోపిడి దారే..                    
పెట్టిందంతా వసూలు చేస్తాడు, కాకుంటే మార్గాలు వేరు..   అందుకే ఆలోచన చేయాలి..

 *మన కులపోడు, మన దోస్తు, మా పార్టీ వాడు, మనకు దగ్గరోడు, పైసలున్నోడు, పరపతి  ఉన్నోడు అని చూడకుoడా.... నిజాయితీగా, సేవకుడిగా ఉండేతోడిని, సొంత ఆలోచనలు మెండుగా ఉన్నా సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి ఉండేతోడిని ఎన్నుకోవడానికి మన ఓటు వేయాలి. అది సార్ధకం కావాలి*... 

ముందే చెప్పినట్టుగా *ఆధ్యాత్మిక అంటే కేవలం పూజలు, అర్చనలు, యజ్ఞ యాగాలు, హోమాలు చేయడం మాత్రమే కాదు.. అదొక నిత్య చైతన్యం*  అని నమ్మి, వీలైనంత త్వరలో *నందివనపర్తిని నందినాథక్షేత్రంగా చూడాలనే ఆశయంతో ఉన్న వ్యక్తిగా అభ్యర్థన చేస్తున్నా*...

*మంచి, చెడు మీకూ తెలుసు... చెడు పైన సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆశిస్తూ*...
:~ సదా వెంకట్ రెడ్డి,

Thursday, December 4, 2025

రామాయణo by యండమూరి

“రామాయణం చదవమని నీ తండ్రికి, భర్తకి, కొడుక్కి... చివరకు నీ మనవడికి కూడా చెప్పు. ఎందుకంటే..." అన్నారు చిరునవ్వుతో.
ఆయన ఏమి చెపుతారా అని అందరం ఉత్సుకంగా వింటున్నాం. 
"భార్య గురించి చెడుగా విన్నా, పరీక్ష వద్దని పాఠం చెపుతుంది రామాయణం..! భార్య దూరమయినా, మరొక వివాహం ఆలోచన రాని రాముని కథ రామాయణం..! ఆత్మ గౌరవానికి అవమానం జరిగినప్పుడు తల వంచుకుని సేవ చేయటం కన్నా భూగర్భ ప్రవేశం మంచిదన్న సీత కథ స్త్రీలందరికీ ఒక పాఠం". 

"మరణం మంచం అంచున నువ్వు సొమ్మసిల్లి, ‘ఆఖరి చూపుగా నిన్నొక్కసారి చూడాలని ఉందిరా’ అని  కబురు చేసినప్పుడు- తండ్రి మాట విని రాముడు సర్వం త్యజించినట్టూ- రాజభోగాలిచ్చే విదేశీ సుఖాన్నీ, అంతగా అవసరమైతే ఉద్యోగాన్ని పక్కన పెట్టి, నిన్ను చూడటానికి వచ్చేటంత ప్రేమను పెంచుకొమ్మని నీ కొడుక్కి చెబుతుంది రామాయణo..! నిర్హేతుకమైన కోరికల వెనుక వెళ్ళటం- బంగారు లేడి వెనుక పరుగెత్తటమ౦త ప్రమాదమని నీ కోడలికి రామాయణం చదివితే తెలుస్తుంది.  వనమున చదివి తండ్రిని మించిన తనయులైన లవకుశుల చరిత్ర,  చదువుకి సుఖసౌఖ్యాలు తప్పనిసరి కాదని నీ మనవలకి చెపుతుంది..! అందుకే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులూ... అందరూ చదవాలి ఆ పురాణ గ్రంధం" అన్నారు.  

ఈ అద్భుతమైన ప్రవచన౦ వింటూ ఉంటే, నా ఒళ్ళు అప్రయత్నంగా జలదరించింది.

"ఎన్నో జీవిత సత్యాలు తనలో నింపుకున్నది ఆ ఇతిహాసం. అమితమైన సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చెయ్యవద్దని చెప్పేది కైకతో వ్యవహారం..! పరాయి స్త్రీ పై వ్యామోహం వలదని చెప్పేది లంకా దహనం..! ఇక పాత్రల  ప్రసక్తి  వస్తే, నిస్వార్థానికి ప్రతీకలు  లక్ష్మణ, భరతులు.  ప్రాణమున్నంత వరకూ నీతి వైపే నిలబడతానంటాడు విభీషణుడు. రెక్కలున్నంత వరకూ చెడుతో పోరాడమంటాడు జటాయువు..! ఉన్న౦తలో సాయం చేయమ౦టు౦ది ఉడుత..! నీలో తెలియని శక్తే ఆంజనేయ చరిత..! ఇంట్లో గానీ, ఆఫీసులో గానీ, వ్యాపారంలో గానీ- నీ ప్రత్యర్థులు నీకన్నా బలవంతులైనప్పుడు, వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే లౌక్యమే వాలి సంహారం..! ఇలా ఎన్నో జీవిత సూత్రాలూ, నీతి పాఠాలూ ఉన్న ఇతిహాసమే రామాయణ౦...!”.

ఆయన కొనసాగించారు: “దానిలో ఒకడికి బురద కనబడవచ్చు. మరొకడికి కమలం కనబడవచ్చు. అంతా నీ దృష్టి మీద ఆధారపడి ఉంటుంది...! చదివే అనుభవ౦ ఫలవంతం కావాలీ అంటే, నీరక్షీరాల్ని విడదీసే ప్రవృత్తిని అలవాటు చేసుకోవాలి” అని ఆయన చెపుతూంటే జనం కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి. ప్రశ్న అడిగిన ఆమె చేతులెత్తి నమస్కారం చేసింది. 
(కొత్త పుస్తకం నుంచి. జనవరి విడుదల)