Wednesday, June 11, 2025

శిక్షణలో అశ్విని ఆరంగేట్రం

*అనుమానాలు,  అవమానాలు దాటుతూ ఆరంగేట్రం*...  
తన ద్వారా శిక్షణ పొందిన విద్యార్థుల అద్బుత ప్రదర్శనలతో, వారి తల్లిదండ్రులు, అతిథుల అభినందనల మధ్య ఆనందబాష్పాలు కార్చిన శిక్షకురాలు అశ్విని.
అందుకే అన్నారు ఏమి ఉన్నా, లేకున్నా సంకల్ప స్వచ్ఛమైనది అయితే శక్తి వెతుక్కుంటూ వస్తుందని..
ఆ ఇంట్లో ఇద్దరూ ఆడపిల్లలే,  ఉన్న కొద్ది పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న తల్లి దండ్రులకు వీళ్ళే తోడు, నీడా.
చిన్నమ్మాయి అయిన  అశ్వినికి మాత్రం సాంస్కృతిక కళలు, కూచిపూడి నృత్యం, భారత నాట్యం, జానపద కళపై మక్కువ ఎక్కువ. నేర్చుకోవాలి, నేర్పించాలి అన్న ఆశకుడా బలంగానే ఉన్నది..
ఇంట్లో ఇద్దరూ ఆడపిల్లలే, అందునా ఇలాంటి ఆటలు, పాటలు డాన్స్ లు అంటే... ఇరుగు - పొరుగు, బంధువులు, దగ్గరోళ్ళు - దూరపోల్లు అందరికీ చులకనేగా.. ఇలాoటి ఆట పాటలు ఆడపిల్లకు అవసరమా అంటూ రోజు ఎవరో ఒకరు అమ్మ నాన్నల చెవులు నింపడమే, దానితో వాళ్ళు బాధపడటం ఏళ్లుగా జరుగుతున్న తంతు. ఆశయం నిండిన ఆ మనసులకు అది అలవాటుగా మారింది, సాధనతో సాధించి చూపాలనే కసీ పెరిగింది..   సేవాభారతి ద్వారా నడుపబడే కిశోరీ వికాస్ కార్యకర్త అయిన తన సోదరి  ఆసరా, అభయంతో ప్రతీ అడుగు ముందుకే వేసిన అశ్విని అనుకున్నది సాధించింది. ఇంకా సాధిస్తానని ప్రతినభూనింది.
తన కిష్టమైన కూచిపూడి, భరత నాట్యం, జానపద నృత్యంతో పాటు శిక్షణ మెలుకువలు నేర్చుకున్నది.
నేర్చుకున్నదే నేర్పడానికి కదా...
గ్రామీణ ప్రాంతంలో ఉన్న చిన్నారులకు ఈ సాంస్కృతిక వారసత్వ సంపదను అందించాలనే తన ఆశయాన్ని నెమరేసుకుంటూ శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టింది.
సంకల్పానికి శక్తి వెతుక్కుంటూ వస్తుందనట్టు ఒక్కొకరుగా శిక్షణ కోసం రావడం ప్రారంభించారు.
 కళల పట్ల అశ్వినికి ఉన్న శ్రద్ధ గమనించిన ఒకరిద్దరు తమకు తగ్గ సహకారం అందించడం మొదలు పెట్టారు. అలా చూస్తుండగానే సంవత్సరo పూర్తయింది..
ఇంకెందుకు ఆలస్యం  సాధనను సమాజానికి పరిచయం చేస్తే బాగుoటుదన్న  పెద్దల సూచన మేరకు మొదటి వార్షికోత్సవం కోసం నిర్ణయం చేశారు..
ఎలాంటి అనుభవం లేని మనం ఎలా నిర్వహిస్తామోనని అనుమానంతో పనులు ప్రారంభించిన సోదరీమణులు అద్భుతంగా *నటరాజ డాన్స్ అకాడమీ(NDA)* మొదటి  వార్షికోత్సవం నిర్వహించి అందరినీ అబ్బుర పరిచారు.
NDAలో శిక్షణ పొందిన తమ పిల్లల నృత్య ప్రదర్శనతో తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బయారు..
ఆహ్వానం మేరకు కార్యక్రమానికి వచ్చిన అతిథుల అభినందనలు, తల్లిదండ్రుల ఆనందోత్సవాల మధ్య మాట్లాడానికి తడబడి ఆనంద బాష్పాలు కార్చింది అశ్విని.
 నిరంతర సాధనలో ఇరుగు పొరుగు, దూరం - దగ్గర బంధువుల ద్వారా  తనకు జరిగిన అవహేళనలు, అవమానాలు నెమరేసుకుంటూ ఇంకా సాధిస్తా అని ప్రతిన చేసింది..
తన ఆశయానికి అండగా ఉన్న అక్కకు, అందరి అవమానాలు భరించి తనకు ఆశీస్సులు అందించిన అమ్మ నాన్నలకు అతిథులచే సన్మానం చేయించింది.
పిలవగానే రావడంతో పాటు, తమకు ప్రేరణా శక్తిని ప్రసాదించారంటూ  అతిథులకు జ్ఞాపికలు అందించింది అశ్విని..
శిక్షార్థులచే ప్రదర్శించిన వాటిలో శ్రీనివాస కళ్యాణం ఘట్టం అత్యద్భుతం.. కళ్ళకు కట్టినట్లు ఉన్న ఆ శ్రీనివాస కల్యాణ తంతును *శ్రీ సీతా రామ కళ్యాణ రూపంలో కూడా అభ్యాసం చేస్తే ఊరూర జరిగే శ్రీరామ నవమి రోజున జరిగే శ్రీరామ కళ్యాణ మహోత్సవాలలో ప్రదర్శన చేయొచ్చు..ఆ బాధ్యత మాది అని ఒక ఆలోచన అందించడం సందర్భోచితంగా జరిగింది. 
*అప్పుడప్పుడు ఇలాంటి  విషయాలు పుస్తకాలలో చదివి అయ్యో అంటాం, స్ఫూర్తి పొందుతాం*...,   
*సినిమాల్లో చూసి కేరింతలు, జయ జయ కారాలు కొడతాం*..
*అలాంటి సాధకులు మన పక్కనే ఉన్నప్పుడు మన శక్తి మేరా ఆసరా అవుదాం అనే ఆలోచన మరిచి పోతాం.. ఇది దురదృష్టకరం.*
  *అలాంటి ఆణిముత్యాలకు అండగా ఉండడం, మన శక్తిమేరా సహకారం అందించడం సామాజిక బాధ్యతగా గుర్తిద్దాం*.. 
*పల్లె ఆణిముత్యాల ప్రతిభ ప్రపంచానికి చాటుదాం.*

అశ్విని ఎలిమినేడు గ్రామానికి చెందిన మణెమ్మ శ్రీరాములు దంపతుల కుమార్తె. 
Nataraja Dance Academy @+917337250387

సదా వెంకట్, GSF.

No comments:

Post a Comment