Saturday, October 12, 2024

ఆయుధ పూజ

రాక్షసులను సంహరించడానికి  దేవతా మూర్తులు చేబూనిన ఆయుధాలతో పాటు అజ్ఞానాన్ని తరిమి, జ్ఞానాన్ని ప్రసాదించే  జ్ఞానజ్యోతి ఆయుధమే....
నిరుపేదల కడుపు నింపి, వారికి జీవనాన్ని అందించే ప్రతీ పనిముట్టూ ఆయుధమే....
అందుకే వాటిని గౌరవంగా, గర్వంగా పూజనీయ భావనతో పూజించడం నేర్పిన పెద్దలకు ప్రణామాలు...
ఆశ్వీయుజ మాసం మహర్నవమి రోజున అన్ని తరాల వారి ఆయుధాలను, అన్ని రకాల వృత్తుల పనిముట్లను గౌరవంగా పూజిస్తూ ఆయుధ పూజ చేసే ఆనవాయితీ Gnana Saraswathi Temple Nandiwanaparthy 
 జ్ఞానసరస్వతిదేవాలయంలో  కొనసాగుతుంది.

Saturday, September 21, 2024

కాల నిర్ణయం కఠినమైనది, కాదనలేనిది.

కాలం - ప్రకృతి.
కాలనిర్ణయం కఠినమైనది, కాదనలేనిది.

కొందరిని యోధులుగా మలుస్తుంది.
అవసరం అనుకున్నప్పుడు, 
కాలం కొందరిని సాటిరాని, పోటీలేని యోధులను, ధీరులను తయారు చేస్తుంది.

కాలం మొదటగా పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది,పరీక్షలు పెడుతుంది, 
శతవిధాల ప్రలోభ పెడుతుంది, అవరోధాలను కలిగిస్తుంది, ఆటంకాలను సృష్టిస్తుంది, అడుగడుగునా ఆశయానికి అడ్డుకట్టలు వేస్తుంది.

జీవితం మీద విరక్తిని కలిగించాలని చూస్తుంది, అవమానాలను రుచి చూయిస్తుంది, అంచనాలను
తలక్రిందులు చేస్తుంది,
ఇవేవీ కూడా యోధులను ఇసుమంత కూడా చెలింపజాలవు.

ప్రకృతి, కాల పరిస్థితులు...
మెల్ల మెల్లగా అవసరం అయిన చోట, అవసరం అనుకున్న వారితో పరిచయం చేయిస్తాయి. 
వాడి ఆలోచనలను ఆమోదింప చేస్తాయి.. 

అనుకున్న స్థాయికి ఎదగడానికి సహకరిస్తాయి.
అనుకూలురు ఎందరో సహకరిస్తుంటారు.
వాడి ప్రవర్తనను చూసి సహాయ పడాలని చూస్తుంటారు.
అన్నీ కూడా యాదృచ్ఛికంగా అలా అలా జరిగిపోతుంటాయి.

కాలం తరిఫీదు ఇచ్చి, కావలసిన విధంగాను, కాలానికి అనుగుణంగా తయారు చేస్తుంది,
రంగడించి, రంగడించి రాయి లాంటి మనసు రత్నంగా మలచుతుంది.

అన్నింటినీ ఎదుర్కోవడానికి, 
అన్ని పరిస్థితులను తట్టుకొని నిలదొక్కుకొనే విధంగా
అతీంద్రియ శక్తులనెన్నింటినో ఒసుగుతుంది.. చివరకు గెలిపిస్తుంది, గేలి చేసిన చోట గంతులేపిస్తుoది..
కాల నిర్ణయం కఠినమైనది, కాదన లేనిది.
~~~~~~~~~~~~~~//~~~~
(సమ్మిళితo)

ఆరంభ - అవసాన దశలో

అవసాన దశలో నేను
ఆరంభ దశలో నీవు
అనుభవాలతో నేను
అమాయకత్వంతో నీవు

వడలిన మేనుతో నేను
చిగురాకు కాయంతో నీవు
చదివిన పుస్తకం నేను
తెరవని గ్రంథం నీవు

పుట్టెడు జ్ఞాపకాలతో నేను
తెల్లని కాగితంలా నీవు
బాధ్యతల చెరలో నేను
బంధాల కౌగిట్లో నీవు

పండిపోయిన తలతో నేను
పండు వెన్నెల నవ్వుతో నీవు
బరువైన బంధంగా నేను
ప్రియమైన బాధ్యతగా నీవు

ఊసులు చెప్తూ నేను
ఊ కొడుతూ నీవు
బోసి నవ్వులతో నేను
పాల బుగ్గలతో నీవు

ఆరిపోయే దివ్వె నేను
వెలిగే దీపం నీవు
రాలిపోయే పువ్వు నేను
వికశించే కుసుమం నీవు...

( సేకరణ:  ఎవరి రచనో తెలియదు కానీ వారికి అభినందనలు....)